మంచుకొండల్లో చిక్కుకున్న పర్వతారోహకులలో 10 మంది మృతి
డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్‌లోని హిమాలయాలలో 10 మంది పర్వతారోహకులు మృతిచెందారు. ద్రౌపది దండా-2 శిఖరాగ్రానికి 40 మంది పర్వతారోహకులు బయలుదేరారు. అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా 29 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకున్నారు. ఉత్తరకాశీలోని మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 34 మంది ట్రెయినీలు, ఏడుగురు శిక్షకులు ద్రౌపది దండా-2 శిఖరాగ్రానికి వెళ్లినట్లు సమాచారం. 14 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న సమయంలో హిమపాతం సంభవించినట్లు తెలుస్తోంది.
హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఐటిబిపిల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సిఎం ధామి పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు సైన్యం సహాయం కోరినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడినట్లు సమాచారం.