11న మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ కీలక సమావేశం
హైదరాబాద్ : ఈ నెల 11న ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యా, అటవీశాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వీటితో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 11న జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, పార్ట్ బీ లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. వ్యాక్సీన్ అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సీన్‌ను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు. అలాగే ఈ సమావేశంలో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి ? ఏ విధంగా నిర్వహించాలి ? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.