111 జిఓ పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేత: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ (CLiC2NEWS): 111 జిఓ పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో ఆయా గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ 69వ నంబర్ ఉత్తర్వును పురపాలక శాఖ జారీ చేసింది. అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతీనరాదని షరతు విధించింది. షరతుల్లో భాగంగా ఎస్టిపిల నిర్మాణం, కాలుష్య తీవ్రత తగ్గింపునకు చర్యలు తీసుకోనున్నారు. భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణకు చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం.. జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రీన్ జోన్లు సహా జోన్ల నార్ధారణ, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాద్ నగర శివారులోని గండి పేట, హిమయత్ సాగర్ జలాశయాల పరిరక్షణకు పది కిలో మీటర్ల మేర కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జిఓ నం. 192 తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8వ తేదీన అప్పటి ప్రభుత్వం జిఓ 111ను తెచ్చింది.