కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

బెంగళూరు (CLiC2NEWS): ఆగి ఉన్న లారీని వెనుక నుండి టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామును కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుండెనహల్లి సమీపంలో పుణె-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందని వారంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరు శివమొగ్గ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వాహన డ్రైవర్ నిద్రమత్తు వలనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.