‘స్టెల్లా ఎల్ పనామా’ నౌకలో 1,320 టన్నుల పేదల బియ్యం
కాకినాడ (CLiC2NEWS): ఎపి నుండి ఇతర దేశాలకు తరలిస్తున్న 1,320 టన్నుల బియ్యాన్ని గుర్తించినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ వెల్లడించారు. కాకినాడ యాంకరేజి పోర్టులోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో పేదల బియ్యాన్ని గుర్తించారు. సత్యం బాలాజి రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమాఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సత్యం బాలాజి రైస్ ఇండస్ట్రీస్ కు ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఎస్‌పి విక్రాంత్ పాటిల్, జెసి రాహుల్ మీనాతో కలిసి మీడియా సమేవేశంలో తెలిపారు.
నవంబరు 27 న యాంకరేజి పోర్టులోని స్టెల్లా నౌకలో 4వేల టన్నుల బియ్యం తనిఖీ చేసినపుడు 640 టన్నుల పిడియస్ బియ్యాన్ని గుర్తించారు. 29న డిప్యూటి సిఎం సందర్శించి ఆదేశించడంతో రెవెన్యూ , పౌరసరఫరాలు, పోలీసు , కస్టమ్స్ , పోర్టు అధికారులతో కమిటి ఏర్పాటు చేసి 12 నమూనాలు సేకరించగా.. వాటిలో మరో 680 టన్నుల పిడియస్ బియ్యంగా తేలింది. నౌకలోని పిడియస్ బియ్యాన్ని సీజ్ చేస్తామని, వాటిని నౌక నుండి కిందకు దింపడానికి 24 నుండి 48 గంటలు పడుతుందన్నారు. బియ్యం రీసైక్లింగ్ చేసే ఆరు మిల్లులను సీజ్ చేశామని తెలిపారు. రేషన్ మాఫియా కట్టడిలో భాగంగా పోర్టులపై నిఘా ఉంచామని, స్మగ్లింగ్ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని కలెక్టర్ తెలిపారు. కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం ఒక్క గ్రాము కూడా దేశం దాటి వెళ్లనీయమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది జూన్ నెలలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన తనిఖీల్లో కాకినాడ లోని పోర్టు దగ్గరలో ఉన్న సత్యం బాలాజి సంస్థకు చెందిన గోదాములో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసిన అధికారులు క్రిమినల్ చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో గోదాములో 6 వేలకు పైగా పేదల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నౌకలో ఉన్న అక్రమ నిల్లలు కూడా ఇదే సంస్థవని తేలింది. బార్జిలో 1,064 టన్నుల పిడియస్ బియ్యం పట్టుబడగా.. అందులో వెయ్యి టన్నులు లవణ్ ఇంటర్నేషనల్ సంస్థవని తేలింది. కరప మండలం నడకుదురులో ఉన్న లవణ్ ఇంటర్నేషనల్ గోదాములో పిడియస్ బియ్యం పట్టుబడ్డాయి. మిగిలిన 64 టన్నుల బియ్యం సాయితేజ ఆగ్రో సంస్థవని తేలింది.