వేసవి దృష్ట్యా నగరానికి అదనంగా 20 ఎంజీడీల నీటి సరఫరా
తాగునీరు, ట్యాంకర్ల సరఫరాపై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రస్తుతం నగరానికి కావాల్సినంత మంచినీరు అందుబాటులో ఉందని, ఈ వేసవిలో నగరంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ… నగరంలో ఎక్కడా తాగునీటి కొరత ఉండొద్దని, అవసరమైన చోట్ల ఉచితంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ట్యాంకర్లు బుక్ చేసుకున్న వారికి సాధ్యమైనంత వేగంగా సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. వేసవి నేపథ్యంలో నగరంలో నీటి వాడకం పెరుగుతున్నందున అదనంగా 20 ఎంజీడీ నీటిని సరఫరా చేయాలని ట్రాన్స్‌మిషన్ అధికారులను ఆదేశించారు.
రానున్న వర్షాకాల ముందస్తు ప్రణాళికపైన కూడా ఎండీ దానకిశోర్ అధికారులతో సమీక్ష జరిపారు. వర్షాకాలంలో సీవరేజి సమస్యలు రాకుండా ముందుగానే ప్రణాళికబద్ధంగా పనులు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీవరేజి ఓవర్‌ఫ్లో, తాగునీటి కాలుష్యం తలెత్తకుండా ముందస్తు నిర్వహణ చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని సీవరేజి లైన్లలో వెంటనే డీసిల్టింగ్(పూడికతీత) పనులు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పనులన్నీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నారు.
బస్తీల్లో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా.. మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన పూడికను వెంటనే అక్కడి తొలగించాలని సూచించారు. ఎయిర్‌టెక్ మిషన్లు వెళ్లగలిగిన బస్తీల్లో మిషన్ల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. ఇందుకు గానూ రెండు షిఫ్టుల్లో 24 గంటలు ఎయిర్‌టెక్ మిషన్లు పని చేసేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్‌టెక్ మిషన్లు వెళ్లలేని చిన్న గల్లీలు ఉన్న బస్తీల్లో.. కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగకుండా పూడికతీత పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగొద్దని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.