అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి

వాషింగ్టన్ (CLiC2NEWS): అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మైనే రాష్ట్రంలో ఓ దుందగుడు విచక్షణారహింగ జరిపిన కాల్పుల్లో 22 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 60 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. లెవిస్టన్‌లోని ఓ బార్ వద్ద ఈ కాల్పులు ఘటన జరిగింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పలువురు కాల్పుల నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగు తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్థానికంగా అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని పోలీసులు సూచించారు. కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. నిందితుడు గతంలో యుఎస్ ఆర్మీలో పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.