23 నుంచి వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ర్టేష‌న్ ప్రారంభం

హైద‌రాబాద్: ఈ నెల(న‌వంబ‌రు) 23 నుంచి తెలంగాణ‌లో వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెలువ‌రించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్‌ను ప్రారంభిస్తార‌ని తెలిపారు. వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ర్టేష‌న్‌కు సంబంధించి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సంబంధిత‌ ఉన్నతాధికారులతో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నదన్నారు.

చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను ధరణి పోర్టల్ అధిగమించిన‌ట్లు చెప్పారు. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నట్లు వెల్ల‌డించారు. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నట్లు సీఎం తెలిపారు. అందుకే కొన్ని రోజులు వేచి చూడాల్సి వ‌చ్చింద‌న్నారు. నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తార‌న్నారు. ధరణి పోర్టల్ అద్భుత ప‌నితీరుప‌ట్ల సీఎం కేసీఆర్ అధికారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, రెవిన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.