AP: భారీ వర్షాలకు కోతకు గురైన 316 జాతీయ రహదారి
చింతూరు (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులు , వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎపిలోని శబరి నదికి వరద నీరు పోటెత్తడంతో అల్లూరి సీతారమారాజు జిల్లాలోని చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య రహదారికి గండిపడింది. 316 నెంబర్ జాతీయ రహదారి కోతకు గురవడంతో ఎపి-ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12 హెక్టార్లకు పైగా వరి పైరు నీటమునిగాయి. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరద నీరు భారీగా చేరుకుంది. అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ఆలయం నుండి పాపికొండల విహారయాత్ర నిలిపివేశారు.