36 ఆలౌట్.. అత్యంత చెత్త రికార్డు!
అడిలైడ్: టీమిండియా చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన రోజు. టెస్టు క్రికెట్లో భారత జట్టు అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది ఇవాళే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇది ఊహించలేనిది. దూకుడు ఆటతో అందర్నీ హడలెత్తించే కోహ్లీ టీమ్ ఇలా కుప్పకూలడం బాధాకరం. గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అనూహ్య రీతిలో పరాభవాన్ని మూటకట్టుకుంటున్నది. టెస్టు చరిత్రలో ఇదో పీడకల కానున్నది. అడిలైడ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ కేవలం 36 పరుగులకే తన రెండవ ఇన్సింగ్‌లో ఆలౌటైంది. భారత్ కోల్పోయింది 9 వికెట్లే అయినా.. చివరి బ్యాట్స్‌మెన్ షమీ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియాకు టార్గెట్ సులవైంది. కేవలం 90 పరుగుల లక్ష్యంతోనే ఆ జట్టు బరిలోకి దిగింది.
ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఈ స్కోరును నమోదు చేసింది. కాగా మహ్మద్ షమీ గాయంతో ‘రిటైర్డ్ అవుట్’గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద 9 వికెట్లతో భారత్ ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువస్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 5 వికెట్లు.. పాట్ కమిన్స్ 4 వికెట్లెతో టీమిండియా నడ్డి విరిచారు.