50 ఏళ్ల మహిళపై మృగాళ్ల లైంగిక దాడి.. హత్య

ల‌క్నో : ఎనిమిదేళ్ల కింద‌ట‌ దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన `నిర్భ‌య‌` త‌ర‌హా ఘోర‌మైన సామూహిక అత్యాచార ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. బ‌డౌన్ జిల్లాలో మాన‌వ మృగాళ్ల అకృత్యానికి 50 ఏళ్ల మ‌హిళ బ‌లైంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌దౌన్ జిల్లాలోని ఉగైతి ఏరియాకు చెందిన ఓ 50 ఏండ్ల మ‌హిళ వృత్తిరీత్యా అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌. ఆమె స్థానికంగా ఉన్న ఓ దేవాల‌యానికి ప్ర‌తిరోజు వెళ్తుండేది. అలాగే ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు గుడికి వెళ్లింది. అక్క‌డున్న పూజారితో పాటు మ‌రో ఇద్ద‌రు క‌లిసి అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌ను నిర్బంధించారు. ఆ త‌ర్వాత ముగ్గురు క‌లిసి ఆమెపై అత్యాచారం చేశారు. ప్ర‌యివేటు భాగాల్లోకి ఇనుప‌రాడ్లు నెట్టారు. ఆ మ‌హిళ ప‌ట్ల అత్యంత క్రూరంగా ప్ర‌వ‌ర్తించి పైశాచిక ఆనందం పొందారు.

అయితే అర్థరాత్రి స‌మ‌యంలో ఆల‌య పూజారి మ‌రో ఇద్ద‌రు క‌లిసి గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ఉన్న మ‌హిళ‌ను ఇంటికి తీసుకొచ్చి.. ఆల‌యానికి వ‌చ్చిన మ‌హిళ ప్ర‌మాద‌వ‌శాత్తు అక్క‌డున్న బావిలో ప‌డిపోయింద‌ని తెలిపాడు. అక్క‌డే ఉన్న మ‌రో ఇద్ద‌రి స‌హాయంతో బావిలో నుంచి ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చామ‌ని చెప్పాడు.

కాగా బాధిత మ‌హిళ‌కు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అనంత‌రం ఆమెకు పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా అత్యాచారానికి గురైన‌ట్లు తేలింది.

అంగ‌న్‌వాడీ టీచ‌ర్ ప‌ట్ల ఆ క్రూర మృగాలు అత్యంత దారుణంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు శ‌వ‌ప‌రీక్ష‌ నివేదిక‌లో తేలింది. ఆమె ప్ర‌యివేటు భాగాల్లోకి ఇనుప‌రాడ్లు నెట్ట‌డంతో పాటు మ‌హిళ ప‌క్క‌టెముక‌లు, కాళ్ల‌ను విర‌గొట్టి, ఊపిరితిత్త‌తుల‌పై బ‌ల‌మైన వ‌స్తువుతో గాయ‌ప‌ర్చిన‌ట్లు వెల్ల‌డ‌యింది.

కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు ఆల‌య పూజారితో పాటు మ‌రొక‌రిని అరెస్టు చేశారు. మ‌రో వ్య‌క్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.