600 మంది ఉక్రెయిన్ సైనికుల హతం: రష్యా
మాస్కో (CLiC2NEWS): ఉక్రెయిన్ సైనికుల స్థావరాలపై రష్యా సేనలు విరుచుపడ్డాయి. ఈ దాడుల్లో 600 మంది ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టినట్లు రష్యా వెల్లడించింది. కాగా ఇది ఎంత వరకు నిజమనేది ఇంకా స్పష్టం కాలేదు. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు ఉక్రెయిన్ దళాలు చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లు రష్యా వెల్లడించింది. వారం రోజుల కిందట రష్యా ఆధీనంలో ఉన్న మకీవ్‌కా ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలు కాల్పులకు దిగాయి. రష్యన్ సైనికుల బ్యారెక్స్‌పై జరిగిన దాడిలో దాదాపు 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడులకు ప్రతీకారంగా పక్కా సమాచారంతోనే ఉక్రెయిన్‌పై దాడులకు దిగినట్లు రష్యా ప్రకటించింది. క్రమాటోర్స్క్ లోని ఓ వసతిగృహంలో 700 మంది, మరో భవనంలో 600 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఒకేసారి మిసైల్స్‌తో దాడులు చేసినట్లు రష్యా వెల్లడించింది. కాగా ఈ దాడులలో 600 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటన విడుదలచేసింది.