అమరచింత కెజిబివిలో 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

వనపర్తి (CLiC2NEWS): జిల్లాలోని అమరచింత కస్తూర్బా విద్యాలయంలో 70 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తర్వాత 11 గంటలకు విద్యార్థినులకు కుడుపునొప్పి ప్రారంభం కావడంతో ఒక్కొక్కరుగా సిబ్బందికి తెలిపారు. రాత్రి భోజనం కలుషితం కావడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారికి రాత్రి వంకాయ, సాంబారుతో భోజనం వడ్డించారు. అయితే ఆ రాత్రి వారిని బయటకు పంపలేదు. ఉదయం వారందర్నీ సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వైద్యులు హుటాహుటిన విద్యార్థులకు వైద్యం అందించారు. వారి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. కాని నలుగురు బాలికలకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ కెజిబివిలో ఆరో తరగతి నుండి ఇంటర్ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరిలో ప్రధానంగా 9,10, ఇంటర్ విద్యార్థినులే అస్వస్థతకు గురయ్యారు. ఆహారం విషతుల్యం అవడంతో వీరు అస్వస్థతకు గురయ్యారా.. మరేమన్నా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.