శ్రీ సత్యసాయి జిల్లాలో 5మంది సజీవదహనం!
తాడిమర్రి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయాన్నే కూలిపనుల నిమిత్తం ఆటోలో వెళ్తున్న వారిపై విద్యుత్ హై టెన్షల్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆటోకు విద్యుత్ షాక్ తగిలి భారీగా మంటలు చేలరేగాయి. ఒక్కసారిగా మంటలు తీవ్రం కావడంతో ఆటోలో ఉన్న 11 మంది ప్రయాణికుల్లో 5 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన పది మంది కూలీలు, కునుకుంట్ల గ్రామానికి చెందిన డ్రైవర్ తలారి పోతులయ్య ఆటోలో కూలీ పనుల నిమిత్తం చిల్లకొండయ్య పల్లికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో విద్యుత్ తీగలు తెగిపడడంతో ఒక్కసారిగా ఆటోకు మంటలు వ్యాపించాయి. దాంతో క్షణాల వ్యవధిలో ఆటో మొత్తం దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో 5 మంది సజీవదహం అయినట్లు సమాచారం. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.