88 కేజీల పసిడి కడ్డీలు పట్టివేత..

అహ్మదాబాద్ (CLiC2NEWS): ఓ ఇంట్లో 88 కేజీల బంగారం కడ్డీలను పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు సుమారు రూ.100 కోట్ల విలువైన దాదాపు 100 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎటిఎస్ పోలీసులు, డిఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా ఓ ఇంట్లో 88 కేజీల బంగారం కడ్డీలు.. 19.66 కిలోల బంగారు ఆభరణాలు గుర్తించారు. పాల్ది ప్రాంతంలో ఉన్న అవిష్కార్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్లో పోలీసులు , అధికారులు సోదాలు నిర్వహించారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా ఉంచిన పోలీసులకు స్మగ్లింగ్ చేసిన బంగారం ఎక్కడ ఉందో సమాచారం అందగా.. ఆ ఇంట్లో సోదాలకు ఉపక్రమించారు.
గాంధీనగర్‌లో ఉన్న ఈ ఫ్లాట్ కలోల్‌కు చెందిన వ్యక్తి పేరు మీద ఉందని.. అతను దానిని మహేంద్ర షా అనే స్టాక్ మార్కెట్ ఆపరేటర్కు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారంలో ఎక్కవ భాగం విదేశాల నుండి అక్రమంగా తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.