9మంది అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్
బెంగాల్, కేరళలో పట్టుకున్న ఎన్ఐఎ
న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు శనివారం పట్టుబడ్డారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు చేసి అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 9 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 9 మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
అల్ ఖైదా ఉగ్రవాదుల నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. అరెస్టు అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు.
అల్ ఖైదా ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేర ఎన్ఐఏ దాడులు చేసి 9 మంది ఉగ్రవాదులను పట్టుకున్నారు. ముర్షిదాబాద్ లో ఆరుగురు, ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. అల్ ఖైదా ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తోంది. కాగా ముర్షీద్ హాసన్, యాకుబ్ బిస్వన్, ముషారప్ హుస్సేన్‌లను కేరళలో, షకీబ్, అబు సోఫియాన్, మెయినల్ మోండల్, యాన్ అహ్మద్, మనుమ్ కమల్, రె్హ్మాన్‌లను ముర్షిదాబాద్‌లో అరెస్టు చేసినట్లు అధికారు తెలిపారు.