9 మంది కూలీల దుర్మ‌ర‌ణం

మరో 11 మంది కూలీలకు తీవ్రగాయాలు

దేవరకొండ: ప‌గ‌లంతా పొలంలో ప‌నిచేసి అల‌సిన బ‌తుకులు ఆట‌లో ఇళ్ల‌కు బ‌య‌లెల్లారు. కానీ వీరు ఆటో ఎక్కిన ప‌దినిముషాల్లోనే కంటెయిన‌ర్ రూపంలో మృత్యుశ‌క‌టం ఎదురుగా దూసుకొచ్చి ఏకంగా 9 మందిని బ‌లిగొంది. నల్లగొండ జిల్లాలో హైద‌రాబాద్‌-సాగ‌ర్ ర‌హ‌దారిపై గురువారం సాయంత్రం పెద్ద అడిశ‌ర్ల‌ప‌ల్లి మండ‌లం అంగ‌డిపేట స్టేజి వ‌ద్ద గురువారం సాయంత్రం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఓ కంటెయినర్‌ లారీ ఎదురుగా 20 మంది వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటోను అతివేగంగా ఢీకొట్టింది. ఆటో డ్రైవ‌ర్‌మిన‌హా మిగిలిన 19 మంది మ‌హిళా కూలీలే. 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి 9 మంది ప్రాణాలను బలిగొన్నది. ప్రమాదంలో మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

దేవరకొండ మండలం చింతబాయికి చెందిన 20 మంది కూలీలు గురువారం ఉదయం ఆటోలో పెద్దఅడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెం సమీపంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కొండమల్లేపల్లి నుంచి పెద్దవూర వైపు తోళ్ల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కును కంటెయినర్‌ లారీ ఓవర్‌టేక్‌ చేస్తున్న క్రమంలో ఎదురుగా కూలీలతో వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ఒకరు, హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

మృతుల వివ‌రాలు

  1. కొట్టం మల్లేశ్‌ (35) (ఆటో డ్రైవర్‌, కూలీ)
  2. కొట్టం చంద్ర‌క‌ళ 30) (మ‌ల్లేశ్ భార్య)
  3. కొట్టం పెద్దమ్మ(52) (మ‌ల్లేశ్ త‌ల్లి)
  4. నోముల అంజమ్మ (50)
  5. నోము ల పెద్దమ్మ(40)
  6. నోముల సైదమ్మ(37)
  7. గొడుగు ఇద్దమ్మ (48)
  8. బడుగు లింగమ్మ (55)
  9. అలివేలు (35)

వీరంతా సమీప బంధువులే. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు.

ప్రమాదంపై గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.