ఫ్రిజ్‌లో 93 ఏళ్ల వృద్ధుడి మృతదేహం

అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బుల్లేకే ఫ్రిజ్‌లో ఉంచానంటున్న మ‌న‌వ‌డు..!

వ‌రంగ‌ల్‌ (CLiC2NEWS): 93 ఏళ్ల వృద్ధుడి మృత‌దేహాన్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచిన హృద‌య‌విదార‌క ఘ‌ట‌న వ‌రంగ‌ల్ గ్రామీణంలో చోటుచేసుకుంది. జిల్లాలోని ప‌ర‌కాల‌లో తాత మృతదేహాన్ని అంత్యక్రియలకు డబ్బుల్లేవని మనవడు ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.

పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల మేర‌కు..
కామారెడ్డికి చెందిన విశ్రాంత ఉద్యోగి బాలయ్య (93) తన మనవడు నిఖిల్‌తో కలిసి పరకాలలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలయ్యకు వచ్చే పింఛను డబ్బులతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. కాగా గ‌త మూడు రోజుల కింద‌ట బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బుల్లేకపోవడంతో తాత మృతదేహాన్ని నిఖిల్‌ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టాడు.

ఈ క్ర‌మంలో ఇంట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టం, బాల‌య్య క‌నిపించ‌క‌పోవ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న ఏసీపీ శివరామయ్య, సీఐ మహేందర్‌రెడ్డి సిబ్బందితో ఇంట్లో సోదాలు చేశారు. ఈక్ర‌మంలో ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న మృత‌దేహాన్ని బ‌య‌ల‌కు తీశారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా అంత్య‌క్రియ‌ల‌కు డబ్బుల్లేకపోవడంతోనే బాల‌య్య మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టానని మ‌న‌వ‌డు నిఖిల్‌ పోలీసులకు వివరించాడు.

Leave A Reply

Your email address will not be published.