యూపీ: శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం

ఘజియాబాద్‌ : యుపిలోని ఘ‌జియాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మురద్‌నగర్‌లో వ‌ర్షం కార‌ణంగా ఓ శ్మశాన వాటిక ఘాట్‌ భవన సముదాయం పైకప్పు కుప్పకూలి 18 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి సమీప దవాఖానలకు తరలించారు.
శ్వ‌శాన వాటిక‌లో ఆదివారం ఓ వ్య‌క్తి అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అంత్య‌క్రియ‌ల‌కు హోజ‌రైన మృతుల బంధువులు వ‌ర్షం కార‌ణంగా నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాన్ని ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో వ‌ర్షం కార‌ణంగా భ‌వ‌నం పైక‌ప్పు కూలిపోయింది. ఘ‌ట‌నా స్థ‌లిలో 8 మంది మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మిగిలిన వారు మ‌ర‌ణించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాద జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.