కొవిషీల్డ్, కొవాగ్జిన్‌.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత‌?

న్యూఢిల్లీ: డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ల అత్య‌వ‌స‌ర వినియోగానికి ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. కొద్ది వారాల్లోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామ‌ని ఇప్ప‌టికే కొవిషీల్డ్ త‌యారు చేసే సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా ప్ర‌క‌టించారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి ద‌శ ప్ర‌యోగాల‌కు సంబంధించిన డేటాను సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 70.42 శాతంగా తేలింది. తొలి ద‌శ‌లో 23,745 మందిపై ప్ర‌యోగాలు చేశారు. రెండు, మూడు ద‌శ‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాలు కూడా ఇలాగే ఉన్న‌ట్లు తెలిపింది. భార‌త్ బ‌యోటెక్ తొలి, రెండో దశ‌ల్లో 800 మందిపై ప్ర‌యోగాలు నిర్వ‌హించింది. వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసిన‌ట్లు చెప్పినా ఎంత శాతం అనేది మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఏ టీకా ధ‌ర ఎంత‌?

ప్ర‌స్తుతానికి వ్యాక్సిన్ అందుకోబోయే తొలి మూడు కోట్ల మందికి ఉచితంగానే ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాతే వ్యాక్సిన్ ధ‌ర‌ను ఈ రెండు సంస్థ‌లు వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే కొవిషీల్డ్ ధ‌ర రూ.400 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా గ‌తంలో వెల్ల‌డించారు. ఇక భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ధ‌ర మాత్రం రూ.100లోపే ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు కానీ దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

Leave A Reply

Your email address will not be published.