లద్దాఖ్‌లో గగనం శత్రు దుర్బేధ్యం

న్యూఢిల్లీ: తూర్పు లద్దాక్లోవాస్తవాధీన రేఖ వెంట చైనా హెలికాప్టర్ల కదలికలు పెరుగటంతో భారత బలగాలు అందుకు దీటుగా మోహరింపులు చేస్తున్నాయి. చైనా హెలికాప్టర్లను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో భారత్ బలగాలుకూడా ఎక్కడికైనా మోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించాయి. ఈ క్షిపణులు సైనికులు భుజం మీద నుంచి ప్రయోగించవచ్చు. వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం.సైన్యంతోపాటు వాయుసేన కూడా వీటిని వినియోగిస్తున్నది. ఆకాశంలో ఎగురుతున్న శత్రు విమానాలు, హెలికాప్టర్లను వీటితో తేలికగా పేల్చేయవచ్చు.
ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణకు ఒకవైపు చర్చలు జరుగుతుండగానే ఇటీవల చైనా యుద్ధ హెలికాప్టర్లను తూర్పు లఢక్‌లో మోహరించింది. గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్-14తోపాటు పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా హెలికాప్టర్లు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. దాంతో అప్రమత్తమైన భారత్ గగనతలాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చింది. శక్తిమంతమైన రాడార్ల ద్వారా అనుక్షణం నిఘా పెట్టింది. ఉపరితలంనుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను మోహరించింది.
లద్దాక్ చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు భారత సైన్యం నిఘాను పెంచారు. భూమ్మీద నుంచే గగన తలంలో జరిగే ప్రతీ కదలికను పసిగట్టేందుకు రాడార్లు ఏర్పాటు చేశారు.