ఆ పాలసీని వెనక్కి తీసుకోండి: వాట్సాప్‌కు భారత్ సర్కార్ వార్నింగ్

న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రైవసీ పాలసీలో ఇటీవల చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని ఆ సంస్థను కేంద్రం ఆదేశించింది. ఏక పక్షంగా చేసిన ఈ మార్పులు ఆమోదయోగ్యమైనవి కాదని తెలిపింది. భారత యూజర్ల ప్రైవసీని గౌరవించాలని తేల్చి చెప్పింది.
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ సీఈవో విల్ కాత్‌కార్ట్‌కు లేఖ రాసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి లేదంటే వాట్సాప్‌ను వదులుకోండి అన్న వాట్సాప్ సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2017) కేసును ప్రస్తావించింది. ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలని ఈ తీర్పు స్పష్టంగా చెప్పిందని, దానిని మీరు గమనించాలని వాట్సాప్‌కు స్పష్టం చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇండియాలో చాలా మంది యూజర్లు ఉన్నారని, ఇప్పుడీ రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుందని ఆ లేఖలో ఐటీ శాఖ అభిప్రాయపడింది.
కొద్ది రోజు క్రింతం టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూజర్స్ వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే అందుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన జాబితాను చూపిస్తూ ఒక పాప్-అప్ విండో ప్రత్యక్షమైంది. ఫిబ్రవరి 8 వ తీదే నుంచి అమల్లోకి రానున్న ఈ పాలసీపై యూజర్స్ అంగీకరించాలన్నది దాని సారాంశం. ఇందులో భాగంగా యూజర్స్ వ్యక్తిగత సమాచారంతో పాటు ఐపి అడ్రస్ వంటి వివరాలను ఫేస్‌బుక్తో పంచుకుంటారంటూ కొత్త గోప్యతా విధానంపై భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సప్ వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న గోప్యతా విధానాన్ని మే 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.