రేపు మల్లేపల్లిలో జాబ్‌మేళా

హైదరాబాద్: విజయనగర్ కాలనీలోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో రేపు (సోమవారం) ఉదయం రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. దాదాపు 100 ఉద్యోగాలను ఈ జాబ్ మేళాలో భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన సంస్థ అయిన క్యాలిబర్ హెచ్‌ఆర్ సంస్థలో టెలీకాలర్స్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచీ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, టీం లీడర్స్ తదితర ఉద్యోగాల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి ఎన్ మైత్రిప్రియ ఈ సందర్భంగా తెలిపారు. 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గల, ఎంబీఏ, బీటెక్, డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావొచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.