ఐరిస్‌తోనే రేషన్ పంపిణీ: మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: ఐరిస్‌తోనే రేషన్ సరుకుల పంపిణీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐరిస్, ఓటీపీ విధానంలో రేషన్ సరుకుల పంపిణీలో గందరగోళ ఏర్పడిన నేపథ్యంలో స్పందించిన మంత్రి లబ్ధిదారులు, రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు. ఐరిస్ విధానంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతేనే ఆధార్‌తో అనుసంధానం అవసరమని సూచించారు. ఐరిస్ విధానానికే మొదటి ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఐరిస్ అనుసంధానంకాని వారు మాత్రమే మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్‌తో ఫోన్‌నంబరు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. అందరూ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నెల రేషన్ సరుకుల పంపిణీ గడువును వారంపాటు పొడిగిస్తున్నామని.. ఈ నెల 22వ తేదీ వరకు అన్ని రేషన్ దుకాణాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
రేషన్ పంపిణీలో సూచనలు..
- రేషన్ సరుకుల పంపిణీకి తొలి ప్రాధాన్యం ఐరిస్‌కే. ఒకవేళ ఐరిస్ పనిచేయని పక్షంలోనే ఆధార్ అనుసంధానం, ఓటీపీ అవసరం.
- రేషన్ కార్డులోని సభ్యుల్లో ఎవరిదైనా ఒకరిది ఐరిస్ లేదా ఆధార్ లింక్ ఉంటే సరిపోతుంది.
- కొత్తగా ఫోన్ నంబరు తీసుకున్నవారు, పాత నంబరు పనిచేయనివారు, ఐరిస్ పనిచేయనివారు మాత్రమే మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.
- ఇప్పటివరకు 95 శాతం ఐరిస్ అనుసంధానం పూర్తయింది. ఐరిస్ విధానం ద్వారానే 60 శాతం రేషన్ సరుకుల పంపిణీ జరిగింది.
- ఈ నెల రేషన్ సరుకుల పంపిణీ గడువును వారం పాటు పొడిగింపు. 22వ తేదీ వరకు అన్ని రేషన్ దుకాణాలు పని చేస్తాయి.