టి.వేదాంత సూరి: మీ చేతుల్లోనే మీ భవిత
జీవితం ఎంతో విలువైనది. అందులోనూ యవ్వనం మరింత అపురూప మైంది. ఈ వయసులో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకూడదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అర్ధ శతాబ్దం క్రితం శ్రీశ్రీ ఒక సినిమా కోసం పాట రాశారు. ఇప్పటికి ఈ వాక్యాలు యువతకు ఒక మేల్కొలుపు కావాలి. మనకు మేధస్సు వుంది, శక్తి వుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ప్రభుత్వాలు వుద్యోగం ఇస్తాయని, ఇవ్వడం లేదని నిరీక్షిస్తూ, కాలాన్ని వృధా చేసుకోవద్దు. ప్రపంచంలో ఏదేశం లో అయినా ప్రభుత్వ ఉద్యోగాలు 10 శాతమే ఉంటాయి. మనవారు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేది ప్రభుత్వంలో కాదు. అక్కడ రక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటారు. తమకు తాము నిలబడతారు. మరి కొందరు మరో పది మందికి అవకాశాలు, ఉపాధి కల్పిస్తారు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఉద్యోగాల కోసం ధర్నా చేయడం, నిరీక్షించడం మీ బలహీనతగా భావించాలి. 20 ఏళ్ళ వయసు వరకు నేర్చుకోవాలి, ఆ తరువాత నేర్చుకున్నది అమలు చేయాలి. మరో విషయం ఏమంటే మన చదువులకు ఉద్యోగాలకు సంబంధం లేదు. మీ అభిరుచి ఒకటి, చేసే వుద్యోగం మరొకటి.. దీని వాళ్ళ జీవితమంతా రాజీ పడవలసి వస్తుంది. చేసే పనిలో సంతృప్తి ఉండదు. వీటన్నింటి కంటే మీకు అభిరుచి వున్న రంగం లో మరింత కృషి చేస్తే జీవితం లో రాణిస్తారు. మీ అభిరుచికి మెరుగులు దిద్దడానికి చదువు ఉపయోగ పడాలి. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది తెలుసుకుని అందులో కృషి చేస్తే తప్పకుండా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అందులో గణనీయంగా రాణిస్తారు కూడా.
ఉన్నత చదువులు చదివి మీ జీవితాలను వేరే వారికి తాకట్టు పెట్టడం కాదు, ఇష్టం లేని పని అసంతృప్తిగా చేయడం కూడా మంచిది కాదు. అనవసరంగా ఉద్యమాలకు వెళ్లడం కాదు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తుందని ఆశ పడటం కాదు. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. పది మందికి ఉపాధి కల్పించి సహకరించండి. అప్పుడు మీరు చేసే పని సార్థకం అవుతుంది. ప్రపంచం లో మన దేశ యూవత ఒక ప్రత్యేకత సాధించాలి. మీరంతా ఈ వైపుగా ఆలోచించండి. మీలో మార్పు వస్తే సమాజం లో అనూహ్య మార్పు వస్తుంది. ఆంతే కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరో వచ్చి ఏదో ఇస్తారని ఆశించి తరువాత సమయం వృధా చేసుకొని మోసపోకండి.
అల్ ది బెస్ట్.
-టి.వేదాంత సూరి
సీనియర్ జర్నలిస్టు