కర్నూలు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. 14 మంది మృతి

క‌ర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జ‌రిగిన‌ ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. వేగంగా వెళ్తున్న టెంపో డివైడర్‌ను దాటుకుని వెళ్లి లారీని ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారిలో ఓ చిన్నారితోపాటు 8 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నుంచి ఓ టెంపో ట్రావెలర్‌ అజ్మీర్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో ఉదయం 4.30 గంటల ప్రాంతంలో వెల్దుర్తి మండలం మాదార్‌పురం వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారని, మదనపల్లె నుంచి అజ్మీర్‌ దర్గా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా ఎస్సీ మాట్లాడుతూ.. టెంపో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తున్నదని అన్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

 

Leave A Reply

Your email address will not be published.