ట్రిలియన్ డాలర్ల కన్నా.. ప్రైవసీనే విలువైనది
వివాట్సాప్, ఫేస్‌బుక్, కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: భారత్‌లో డబ్బు కన్నా వ్యక్తిగత ప్రైవసీకే ప్రజలు ఎక్కువ విలువ ఇస్తారని, అందువల్ల ఆ గోప్యతను పరిరక్షించాల్సిన బాద్యత తమపై ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త గోప్యతా విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. వాట్సాప్ తన యూజర్ల బిజినేస్ సంభాషణలను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ కొత్త పాలసీని అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్స్‌లో వాట్సాప్ పని చేయదని వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా దీనిపై యూజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుంతుదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్మన్య సింగ్ సరీన్, మరికొందరు కొత్త ప్రైవసీ పాలసీపై స్టే విధించాల్సిందిగా కోరతూ సుప్రీం కోర్టును కోరారు. ఈ అభ్యర్థన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు.
“కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతను కోల్పోతామని ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము వాట్సాప్‌లో పంపించే మెస్సేజ్‌లు ఫేస్‌బుక్‌లో పంచుకుంటారేమోనని భయపడుతున్నారు. మీది ట్రిలియన్ల విలువగల కంపెనీ కావచ్చు కానీ ప్రజలకు వారి వ్యక్తిగత గోప్యత అంతకంటే విలువైనది. వారి ప్రైవసీని పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది“ అని వెల్లడించింది.
కాగా వాట్సాప్, ఫేస్‌బుక్ తరఫున కపిల్ సిబాల్, అరవింద్ దాతర్ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని వారు కోర్టుకు తెలిపారు.