పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

పుదుచ్చెరి: పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో సిఎం నారాయణస్వామి విఫలమయ్యారు. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సిఎం సభనుంచి వెళ్లిపోయారు. బల పరీక్ష కోసం పుదుచ్చేరి అసెంబ్లీలో సోమవారం ప్రత్యేక సమావేశమైంది. సభ సమావేశమైన తర్వాత నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే తీర్మానంపై ఓటింగ్ జరుగక ముందే సీఎం నారాయణ స్వామి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ విపి శివకొలుందు ప్రకటించారు.
మరోవైపు సిఎం తన పదవికి రాజానామా చేసేందుకు శాసన సభ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు బయల్దేరారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా అందజేశారు. మెజార్టీ నిరూపించుకోవడానికి 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. కాంగ్రెస్ దగ్గర 12 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్షలో ఓటింగ్‌కు ముందు మాట్లాడిన నారాయణస్వామి.. తమకు మెజార్టీ ఉన్నదని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ కిరణ్ బేడీపై ఆయన ఆరోపణలు గుప్పించారు. తన ప్రభుత్వాన్నిపడగొట్టడానికి ప్రతిపక్షంతో చేతులు కలిపినట్లు విమర్శించారు.
కాగా ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా కిరణ్‌బేడీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పించి.. తెలంగాణ గర్నర్ తమిళసై కి అదనపు బాధ్యతలు అప్పగించారు. దాంతో కొత్త గవర్నర్ నారాయణ స్వామి సర్కార్ సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.