ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు ఇసి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలో పీఆర్సీకి ఇసి పచ్చ జెండా ఊపింది. పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీఆర్సీ మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై ఇసి స్పందిస్తూ వేతన సవరణ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదంది. కాగా పీఆర్సీ ప్రకటన ద్వారా రాయకీయలబ్ది పొందేందుకు ప్రయత్నించరాదని పేర్కొంది.
నిజానికి తెలంగాణలో పీఆర్సీ గురించి ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. పీఆర్సీపై సూచనప్రాయంగా చెప్పిన సిఎం ఇప్పుడు రెండు, మూడు రోజుల్లో స్వయంగా తానే పీఆర్సీపై ప్రకటన చేస్తానని కూడా మొన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ శుభవార్త వినిపించారు. ఉద్యోగుల మీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపిస్తామని సిఎం చెప్పుకొచ్చారు.