రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
భారతీయ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనే చెప్పాలి. 1969 నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాకు పితామహునిగా నిలచిన దాదాసాహెబ్ దుండిరాజ్ గోవింద ఫాల్కే స్మారకార్థం ఈ అవార్డును ప్రవేశ పెట్టారు. భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు 2019వ సంవత్సరానికి రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్టు ఆయన తెలియజేశారు. 1969 నుండి ఈ అవార్డులని ప్రకటిస్తుండగా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఇప్పటి వరకు హిందీ చిత్ర సీమ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భాషల నుండి ఎంపికయ్యారు.
రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందిస్తున్నారు. పలువురు బీజేపీ నాయకులు సైతం రజనీకాంత్ వంటి గొప్పనటునికి రావలసిన అవార్డు ఇదని శ్లాఘిస్తున్నారు. రజనీకాంత్ కీర్తి కిరీటంలో అపూర్వరత్నంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2000లో రజనీకాంత్ కు పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ లభించాయి. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు రజనీ దరి చేరింది.
పలువురికి రజనీ స్ఫూర్తి!
ఆరడుగుల పొడవూ కాదు.. కండల వీరుడు అంతకన్నా కాదు. నల్లగా, బట్టతలతో సన్నగా సామాన్యుడిలా ఉంటాడు. కానీ ఏదో సమ్మోహన శక్తి.. అభిమానులకు ఆయన ఆరాధ్యదైవం.. జనం మెచ్చిన సూపర్‌స్టార్.. నిర్మాతల పాలిట కామదేనువు.. ఆయనే రజనీకాంత్ అసలుపేరు శివాజీరావ్ గైక్వాడ్. రజనీకాంత్ చిత్రసీమలో సూపర్ స్టార్ గా వెలిగిన వైనాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో సినిమా రంగంలో అడుగుపెట్టి నటులుగా రాణించారు. అలా పలువురికి ఆదర్శంగా నిలచిన రజనీకాంత్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం గర్వించదగ్గ విషయమే!
రజనీకాంత్ జీవితాన్ని చూస్తే, ఆయన ఒక్కోమెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్న తీరు ఎవరినైనా ఆకట్టుకోకమానదు. మాతృభాష మరాఠీ. పుట్టింది, పెరిగింది కర్ణాటకలో. కండక్టర్ గా పనిచేసింది బెంగళూరులో. హీరోగా రాణిస్తోంది తమిళనాట. బెంగళూరులో కన్నడ సినిమాలతో పాటు, తెలుగు, తమిళ, హిందీ, మళయాళ చిత్రాలూ ప్రదర్శితమయ్యేవి. పౌరాణికాల్లో యన్టీఆర్ ను విశేషంగా అభిమానించే రజనీకాంత్ సాంఘికాల్లో హిందీనటుడు శత్రుఘ్న సిన్హాను ఇష్టపడేవారు. యన్టీఆర్ ను ‘అన్న’గా అభిమానించే రజనీకాంత్, తన అభిమాన నటుడు యన్టీఆరేనని తమిళనాడులో సైతం పలుమార్లు చెప్పారు.