సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50% సిబ్బందికి పాజిటివ్!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. అత్యున్నతన్యాయస్థానంలోని 50% మంది సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు గదులతో సహా సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
ప్రస్తుతం దేశం కరోనా మహ్మమ్మారి యొక్క కొత్త తరంగాన్ని ఎదుర్కొంటోంది.. గత వారంలో సుమారు 10 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా ఆరవ రోజు 1,68,912 కొత్త ఇన్ఫెక్షన్లతో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం తాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 904 మంది వరకు కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించారు.