ప్రధాని మోడీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. ఈ మేరకు ట్విటర్‌ ప్రతినిధులు తెలిపారు. రాత్రి 3.15 గంటల సమయంలో మోడీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పిఎం కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ మోడీ ఖాతా నుంచి హ్యాకర్‌ ట్వీట్‌ చేశాడని, అందులో బిట్‌ కాయిన్‌ డిమాండ్‌ చేశాడని, ఆ వెంటనే ట్వీట్లను తొలగించాడని ట్విటర్‌ ప్రతినిధులు తెలిపారు. జాన్‌విక్‌ గ్రూప్‌ హ్యాక్‌ చేసినట్లుగా గుర్తించారు. మోడీ ట్విటర్‌ అకౌంట్‌ ప్రస్తుతం 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, జో బిడెన్‌ లాంటి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే..

కాగా ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కు అనుసంధానంగా ఉన్న narendramodi_in హ్యాండిల్‌కు 2.5 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఈ అకౌంట్‌ నుంచి మోదీ ఇప్పటి వరకు సుమారుగా 37 వేల ట్వీట్లు చేశారు. చివరిసారిగా ఆగష్టు 31న మన్‌ కీ బాత్‌ గురించి ఇందులో ప్రస్తావించారు. ఇక ట్విటర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలైలో ఎంతో మంది ప్రముఖుల ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రస్తుతం డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్‌, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, ప్రముఖ బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌ తదితరుల ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.