India Covid-19: వణికిస్తోన్న మహమ్మారి
దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయానికి భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 2,812 మంది మరణించారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,02,367 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపగా 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,13,163కు పెరిగింది. తాజాగా కరోనా బారిన పడి 2812 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మరణాల సంఖ్య 1,95,123 కి చేరింది.
తాజాగా దేశంలో కరోనా బారి నుంచి 2,19,272 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,43,04,382 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 28,13,658 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మహారాష్ట్రలో అధికంగా..
దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం మరణాల్లో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. తాజాగా అక్కడ 832 మంది మరణించారు. అలాగే 66 వేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఢిల్లీలో 22,933 కొత్త కేసులు వెలుగు చూడగా.. 350 మంది ప్రాణాలు వదిలారు. యుపిలో 35 వేలు, కర్ణాటకలో 34 వేల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.