బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఏడుగురు మృత్యువాత

చెన్నై: తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ బాణసంచా కర్మాగారంలో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమాని సహా ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో నలుగు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి.
రాష్ట్రరాజధాని చెన్నైకి 190 కిలో మీటర్ల దూరంలో ఉన్న కడలూరు జిల్లాలోని కట్టుమున్నార్ కోయిల్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన గురించి కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ మాట్లాడుతూ.. ‘‘కట్టుమన్నార్‌కోలికి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉంది. మృతులంతా అక్కడ పనిచేసే వాళ్లే. నాటు బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. పరిమితికి మించి పేలుడు పదార్థాలు వాడినందు వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నాం.’అని తెలిపారు.