80 ప్రత్యేక రైళ్లకు ఓకే

న్యూఢిల్లీ : భారతీయ రైల్వే సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. అన్లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైల్వేబోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ సైతం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.
‘ఏదైనా రైలుకు డిమాండ్ ఎక్కువై, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్లోన్ రైళ్లను ఆ వెనుకనే నడుపుతాం. అందువల్ల ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు’ అని వీకే యాదవ్ తెలిపారు. పరీక్షలు, ఇదే తరహా కారణాలతో రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడల్లా రైళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు.