కన్నుమూసిన ‘లవకుశ’ నాగరాజు
హైదరాబాద్: అలనాటి అపురూప చిత్రాలలో లవకుశ ఒకటి.. ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి నటన ఈనాటికి ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేస్తుంది. ఈనాడు పెరిగి పెద్దవారయినప్పటకీ లవ,కుశలుగానే అందరి చేత గుర్తింపు పొందారు. లవ కుశ సినిమాలో లవుడుగా తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడి పెరు నాగరాజు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆ సినిమాలో రాముడి పాత్ర పోషించగా ఆయననే ఎదిరించి యుద్దం చేస్తారు మన లవకుశలు. ఆ సినిమా ద్వారా ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త లవకుశ సినీమా అభిమానులను ఎంతో కలచివేస్తోంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక లవకుశతో పాటుగా ఆయన భక్తరామదాసు చిత్రంలోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. అయన అసలు పేరు నాగేందర్‌రావు. సుమారుగా 300 చిత్రాల్లో ఆయన నటించారు.
‘లవకుశ’ సినిమాలో రాముడు పాత్రలో ఎన్టీఆర్, సీతగా అంజలీదేవి, లవుడి పాత్రలో నాగరాజు, కుశుడుగా సుబ్రమణ్యం, వాల్మీకిగా చిత్తూరు నాగయ్య, లక్ష్మణుడుగా కాంతారావు నటించారు. సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు ఈ చిత్రానికి దర్శకులు. ఘంటసాల సంగీతం అందించారు. 1963లో విడుదలైన లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. 1934లో నిర్మించిన బ్లాక్ అండ్ వైట్ ‘లవకుశ’చిత్రానికి దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ‘లవకుశ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది.