‘మహా’ ప్రభుత్వంపై కంగనా ట్వీట్‌

ముంబయి : రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు, బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌కు మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి ముంబయికి బయలుదేరిన ఆమె మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై ట్వీట్‌ చేశారు. ”నేను చెప్పినట్లుగానే ముంబయికి బయలుదేరాను. అయితే నాకంటే ముందే మహారాష్ట్ర ప్రభుత్వం, వారి గూండాలు నా ఆఫీస్‌, నివాసాన్ని చట్టవిరుద్ధంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు” అని ట్వీట్‌ చేశారు. ” కానీయండి, మహారాష్ట్ర ప్రభుత్వ అహంకారం కోసం నా రక్తమివ్వడానికైనా సిద్ధంగానే ఉన్నానని ముందే ప్రకటించాను. అన్నీ కూల్చేసినా.. నా భావాలు నాకు ఉన్నాయి” అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా బుధవారం బీఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు చెందిన బాంద్రా బంగళాలో చట్టవిరుద్ధ మార్పులను కూల్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ మార్పులకు బీఎంసీ నుంచి అనుమతులు పొందలేదన్నారు. కంగన రనౌత్ బుధవారం సాయంత్రం ముంబై చేరుకుంటారు. ఆమె బుధవారం ఉదయం తన భద్రతా సిబ్బందితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని కోఠిలో ఓ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడి నుంచి విమానంలో ముంబై వెళ్తారు.

ఇదిలా ఉంటే.. కంగనా రనౌత్‌కు, శివసేనకు మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఈ వ్యాఖ్యల చేసినందుకు కంగనా బేషరతుగా క్షమాపణ చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పని పక్షంలో ముంబైలో అడుగుపెట్టనిచ్చేది లేదని శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కంగనాను హెచ్చరించారు. ఈ హెచ్చరికలను లెక్క చేయని కంగనా.. తాను ముంబై వస్తున్నానని.. దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరింది. హోం శాఖ కల్పించిన వై కేటగిరి భద్రత నడుమ ఆమె ఇవాళ హిమాచల్ నుంచి ముంబైకి బయల్దేరింది.

మరికొద్దిసేపట్లో ఆమె ముంబైకి చేరుకోబోతున్న తరుణంలో బీఎంసీ అధికారులు మణికర్ణిక కార్యాలయ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కూల్చివేత గురించి తెలుసుకున్న కంగనా మరోసారి తీవ్రంగా స్పందించింది. తన ముంబై ఇప్పుడు పీవోకేగా మారిందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కానీ తన శత్రువులు నిరూపించడానికి ప్రయత్నిస్తుంటారని.. అందుకే ముంబై ఇప్పుడు పీవోకేగా మారిందని కంగనా ట్వీట్ చేసింది. ఏది ఏమైనా కంగనాకు శివ‌సేన‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఈ గొడ‌వ చిర‌కు ఎటు దారిస్తోందో చూడాలి!

 

Leave A Reply

Your email address will not be published.