బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది: ఈటల

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారతీయ జనతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో సోమవారం మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరారు. అనంతరం ఈటల రాజేందర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలసు అని అన్నారు. రాష్ట్రం సాధించాక కెసిఆర్ పాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని అనుకున్నామని కానీ, మేధావుల సూచనలు తీసుకుంటామని మొదట్లో చెప్పిన కెసిఆర్.. చివరకు అనేక మంది మేధావుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేసిఆర్ నేతృత్వంలో ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మంత్రులు గుండెలమీద చేయివేసుకొని చెప్పాలన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన వారందరినీ బిజెపిలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.
కాగా ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి.