గత 24 గంటల్లో 96వేల కొత్త కేసులు 1209 మరణాలు

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతమవుతోంది. దేశంలో కేసులు పెరగడంతోపాటు.. అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒకే రోజులో 96,551 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో దేశంలో కోవిడ్ -19 రోగుల సంఖ్య 45 లక్షలకు పైగా పెరిగింది. అయితే, ఈ వ్యాధి నుండి కోలుకునే వారి సంఖ్య కూడా పెరిగిందనేది ఉపశమనం కలిగించే విషయం. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 35 లక్షల 42 వేలకు పైగా ప్రజలు కోలుకున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం అందించిన గణాంకాల ప్రకారం… గత 24 గంటల్లో 1,209 మంది మరణించడంతో మరణాల సంఖ్య 76,271 కు పెరిగింది. కాగా, దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 45,62,415 కు పెరగ్గా, అందులో 9,43,480 మంది చికిత్స పొందుతున్నారు. 35,42,664 మంది ఈ వ్యాధి నుండి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మొత్తం కేసులలో విదేశీ పౌరులు కూడా వున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 11.5 మిలియన్లకు పైగా నమూనాలను పరీక్షించారు, సెప్టెంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5,40,97,975 నమూనాలను పరీక్షించారు, గురువారం ఒక రోజు 11,63,542 నమూనాలను పరిశీలించారు. అయితే కోవిడ్-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికిపైగా ఇతర సమస్యలు ఉన్నవేరేనని అధికారులు పేర్కొన్నారు.