MAA మాది ఆవేదనతో పుట్టిన ప్యానల్‌: ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌: సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మా ఎన్నిక‌ల బ‌రిలో పోటీ ప‌డేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత‌, హేమ ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌కాష్ రాజ్ ఇప్ప‌టికే త‌న ప్యానెల్‌ను కూడా ప్ర‌కటించాడు. అయితే ఆయ‌న‌ని ప‌ర‌భాషా వ్య‌క్తి అని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్ .. శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

‘‘నాలుగైదు రోజుల నుంచి మీడియాలో వస్తోన్న ఊహాగానాలు చూస్తుంటే కొంచెం భయం వేసింది. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమవుతున్నారంటూ కొన్నిచోట్ల వార్తలు వచ్చాయి. మా అధ్య‌క్ష ప‌దవికి పోటీ చేయాలనేది ఇప్పుడు నిర్ణ‌యం కాదు. దీని వెన‌క చాలా మ‌థ‌నం దాగి ఉంది. ఇది కోపంతో వ‌చ్చింది కాదు, ఆవేద‌న‌తో పుట్టిన సినిమా బిడ్డ‌ల ప్యానెల్ ఇది. మూడు దశాబ్దాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నా. ఈ పరిశ్రమ నాకు పేరు, హోదా, గౌరవం అన్నీ ఇచ్చింది. ఇక్క‌డ జ‌రుగుతున్న‌వి చూస్తూ ఉండ‌లేక‌పోయాను. ఒక ఏడాది క్రితం నుంచి కళ్ల ఎదురుగా జరుగుతున్నది చూస్తూ కూర్చోవటం సరికాదనిపించింది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలనిపించింది. నాలా ఆలోచించేవారితో ఒక టీమ్‌ తయారుచేసుకున్నా` అని ప్ర‌కాశ్ రాజ్ పేర్కొన్నారు.

`మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున.. ఇలా ప్రతిఒక్కరిదీ ఒక్కటే తపన.. అసోసియేషన్‌ని అభివృద్ధి చేయడమే. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లోకల్‌, నాన్‌లోకల్‌ అని వింటున్నాను. కళాకారులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో నాన్‌లోకల్‌ అనే అంశం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇదేం అజెండా.  అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్‌లోకల్‌ కాలేదే! నవనందులు తీసుకున్నప్పుడు నాన్‌లోకల్‌ కాలేదే! అప్పుడు లేని విషయం ఇప్పుడు ఎలా వచ్చింది..? ఈ కామెంట్స్‌ చేసేవారి సంకుచిత మనస్తత్వం, వారి స్థాయి, వారి మానసిక పరిస్థితిని మనం గమనించాలి..

నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్‌ అంటున్నారు. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ‘మా’ ఎంతో బలమైన అసోసియేషన్‌. ఇది కోపంతో పుట్టిన ప్యానల్‌ కాదు. ఆవేదనతో పుట్టింది. ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే.

మా కు ఒక ఇల్లు లేదు. సభ్యుల ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఒక ఆర్టిస్టు కొడుకు ‘మా’ అసోషియేషన్‌కు వస్తే- ‘మా నాన్న ఆర్టిస్టు’ అని గర్వంగా ఫీలవ్వాలి. అతని గుండె ఉప్పొంగాలి. ఆ నమ్మకం, కౌగిలింపు సభ్యులకు అసోషియేషన్‌ ఇవ్వగలగాలి. సభ్యులకు అసోషియేషన్‌ ఇచ్చేది దానం కాకూడదు. వారు కష్టపడి పనిచేసి సంపాదించుకొన్న ఆత్మగౌరవం కావాలి. ఈ మేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.