TS: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

ఆదిలాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న వ్యాన్, ట్రాక్టర్ ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు మరణించారు. కాగా.. ట్రాక్టర్ డ్రైవర్ అంకొలి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు గురించి తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘనటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. శనివారం ఉదయం కూలి పనికి వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిని మహారాష్ట్రకు చెందిన సందీప్ (18), వెంకట్ పవార్ (15)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.