ఎల్లంపల్లి ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత!

మంచిర్యాల (CLiC2NEWS): అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు దూకుతున్నాయి. జోరు వానలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో వరద నీటితో ఉత్తర తెలంగాణలోని ఎల్లంపల్లి, పార్వతి బ్యారేజ్, కడెం జలాశయాలు నిండు కుండలా మారాయి. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 87,440 క్యూసెక్కులగా ఉంది. దీంతో అధికారులు ఇవాళ (బుధవారం) ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేశారు. 87,440 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టిఎంసిలు కాగా.. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.73 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

పెద్దపెల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతీ బ్యారేజ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. పార్వతీ బ్యారేజ్‌లో ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 32,736 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ 74 గేట్లలో 40 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. పార్వతీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటినిల్వ 8.83 టిఎంసిలు. ప్రస్తుతం 7.10 టిఎంసిల నీరు ఉంది.

నిండిన కడెం ప్రాజెక్టు
నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 5 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు. 32,119 క్యూసెక్యుల వరద నీరు ఇన్‌ఫ్లో ఉండగా… 5 గేట్ల ద్వారా 32,279 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.