అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

గుంటూరు: సెల్ఫీ సరదా మరో ప్రాణాన్ని బలి తీసుకొంది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు తెలుగు యువతి దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (27) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందారు. నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా మృతదేహాన్ని తీసుకు రావడానికి ప్రభుత్వం సాయం చేయాలని పలువురు కోరుతున్నారు.