TS: దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం: ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.
ఈ సదస్సుకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎస్సీ ప్రతినిధులు హాజరయ్యరు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. దళితబంధు లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దీన్ని విజయవంతం చేయాలన్నారు.
హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించినట్లు గుర్తు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు. నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితే విజయం సాధ్యమని.. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని సిఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితబంధువులతో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.