TS: నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రూ. 150 కోట్లు: కెసిఆర్

నల్లగొండ (CLiC2NEWS): నల్లగొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని కెసిఆర్ స్పష్టం చేశారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. హాలియా, నందికొండ అభివృద్ధికి రూ. 15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియా మార్కెట్‌యార్డులో సీఎం సమీక్ష నిర్వహించారు.
సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నోముల భగత్ అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంలో ఆయా నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి పని చేశారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ ఎమ్మెల్యేలు రిపోర్టు ఇచ్చారు.
ఇక సాగర్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. సిబ్బంది, భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేస్తాం.
రాష్ట్రంలో హాస్పిటల్స్ ఆశించిన స్థాయిలో లేవు అని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి కాలేజీలో 500 బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. సూర్యాపేట, నల్లగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం. సాగర్‌లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం ప్రకటించారు.
ఆరునూరైనా దళిత బంధు అమలు చేస్తాం
`దేఃలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నాం. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌తో పాటు ఇరిగేషన్ భూముల్లో ఉన్నవారిని క్రమబద్దీకరిస్తాం. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ, హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. ఈ పని నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు.
దళిత బంధు కోసం లక్షకోట్లయినా ఖర్చు చేస్తాం. తెలంగాణ ఎస్సీలు దేశానికి ఆదర్శమవుతారు. రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది దళితులు ఉన్నారు. వీరిలో దాదాపు 12 లక్షల మంది దళిత బంధుకు అర్హులు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బ్యంకుతో సంబంధం లేకుండా దళితబంధు కింద రూ. 10 లక్షలు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 కుటుంబాలకు వచ్చేలా చర్యలు చేపడతాం. ఆరునూరైనా దళిత బంధును అమలు చేసి చూపిస్తాం` అని సిఎం అన్నారు.