సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు..
చెన్నై : వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు బయపడి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని, ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం సుబ్రమణియం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎపి సాహికి సోమవారం లేఖ రాశారు. నీట్ పరీక్షల భయంతో తమిళనాడులో వారం కిందట నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల మరణం తనను మానసికంగా ఎంతో కలచి వేసిందని పేర్కొంటూ.. నటుడు సూర్య ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ప్రకటనలో ”కరోనా వ్యాప్తి నేపథ్యంలో గౌరవ న్యాయమూర్తులు తమ ప్రాణాల పట్ల భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేస్తూ తీర్పులు వెలువరిస్తున్నారు. కానీ నీట్ విషయంలో వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులను మాత్రం భయపడకుండా పరీక్షా కేంద్రాలకు వచ్చి నీట్ రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ఇవి ‘మనునీతి పరీక్షలు” అని పేర్కొన్నారు. సూర్య ప్రకటనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. అయితే ఈ వ్యాఖ్యల అనువాదాన్ని ప్రామాణికంగా తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం. సుబ్రమణియం సూర్యపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, సూర్య చేసిన తమిళ ప్రకటన అనువాదాన్ని న్యాయమూర్తి సుబ్రమణియం ప్రామాణికంగా తీసుకున్నారని, ఈ అనువాదంలో దోషాలు ఉన్నాయని, సూర్య చేయని వ్యాఖ్యలను అనువాద కాపీలో చేర్చారని హైకోర్టు మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. సూర్యపై ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఎవరినీ కించపరచలేదని అన్నారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కె. చంద్రూ, జస్టిస్ కేఎన్ బాషా, జస్టిస్ సుదందిరం, జస్టిస్ హరిపద్మనాభన్, జస్టిస్ కె. కన్నన్, జస్టిస్ జీఎం అక్బర్ అలీ హైకోర్టు సీజేకి లేఖలు రాశారు.
కాగా మరో నటుడు మాధవన్ కూడా స్పందిస్తూ.. “నీట్ పరీక్ష ముందు రోజే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజంగా ఎంతో బాధాకరం.. అది కేవలం ఓ పరీక్ష మాత్రమే, తీర్పు కాదు“ అని పేర్కొన్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు.