గుడిసెలోకి దూసుకెల్లిన ట్రక్కు.. 8 మంది మృతి

అమ్రేలీ (CLiC2NEWS): వారంతా భోజనాలు చేసి.. నిద్రలోకి జారకున్నారు. మరికొంతసమయమైతే తెల్లారుతుంది. ఈ లోగానే మృత్యువు వారందరినీ కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని అమ్రేలీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కనున్న గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లి 8 మంది దుర్మరణం చెందారు. అమ్రేలి జిల్లాలోని సావర్కుండ్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు వృద్ధులు సహా మొత్తం 8 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అమ్రేలి పోలీసు సూపరింటెండెంట్ నిర్లిప్త్ రాయ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.