GSLV F10: రాకెట్ లో స‌మ‌స్య‌.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 ప్రయోగం విఫలం

శ్రీహరికోట (CLiC2NEWS): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో సింక్రోస‌న్ శాటిలైట్ లాంచ్ వేహిక‌ల్ (జీఎస్‌ఎల్‌వీ)ఎఫ్ 10 ప్రయోగం విఫలమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 వాహక నౌక ద్వారా జీఐశాట్‌-1 ఉపగ్రహం క్రయోజనిక్‌ దశలో రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వాహకనౌక.. ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. రెండు దశల వరకు రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లింది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందని.. దీంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10ని శాస్త్రవేత్తలు ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ వాహకనౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 26 గంటల పాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్‌ కొనసాగిన తర్వాత వాహకనౌక నింగిలోకి వెళ్లింది.

భూ ప‌రిశీల‌న కోసం దీన్ని ప్ర‌యోగించారు. నీటివనరులు, పంటలు, తుపానులు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను గురించి ఇది నిరంత‌రం స‌మాచారం అందించాల్సి ఉంటుంది. అయితే రాకెట్‌ క్రయోజెనిక్‌ దశలో సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైంది. గతేడాది మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనా ఉద్ధృతి, సాంకేతిక సమస్యలతో అప్పుడు నిలిచిపోయింది.

Leave A Reply

Your email address will not be published.