దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పండి.. రాజ్య‌స‌భ ఘ‌ట‌న‌పై మంత్రుల డిమాండ్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో విప‌క్షాలు వ్య‌వ‌హ‌రించిన తీరును కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. పార్ల‌మెంట్ ను స‌జావుగా సాగ‌నీయ‌కుండా ఆటంకం సృష్టించ‌డం, బెదిరింపు ధోర‌ణుల‌తో వ్య‌వ‌హిరంచినందుకు ప్ర‌తిప‌క్షం దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

పార్ల‌మెంట్‌లో త‌మ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తాల‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తార‌ని, కానీ విప‌క్షాలు అరాచ‌కాన్ని సృష్టించాయ‌ని, వాళ్లు ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోలేద‌ని, ప‌న్నుదారుడి సొమ్ము వృధా అయ్యింద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఖండిస్తున్నామ‌ని, మొస‌లి క‌న్నీళ్లు ఆపేసి, విప‌క్షాలు దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రి ఠాకూర్ తెలిపారు. వీధుల నుండి పార్ల‌మెంట్ దాకా ఆరాచ‌కం సృష్టించ‌డ‌మే విప‌క్షాలు అజెండాగా పెట్టుకున్నాయ‌ని మండిప‌డ్డారు.

రాజ్య‌స‌భ‌లో బుధ‌వారం నాడు కొంద‌రు ఎంపీలు.. టేబుళ్లు ఎక్కార‌ని, వాళ్ల‌కు వాళ్లు గ‌ర్వంగా ఫీల‌వుతున్నార‌ని, ఏదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు వాళ్లు భావిస్తున్నార‌ని, స‌భ‌లో జ‌రిగిన దాన్ని షూట్ కూడా చేశార‌ని, పార్ల‌మెంట్‌లో వీడియో షూటింగ్ కు అనుమ‌తి లేద‌ని మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు.

ఈ త‌ర‌హా ప్ర‌వ‌ర్త‌న పార్ల‌మెంటీరియ‌న్ల‌కు స‌మంజ‌సం కాద‌ని మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. ఫ‌ర్నీచ‌ర్‌, డోర్ల‌ను ధ్వంసం చేశార‌ని, మంత్రుల చేతుల నుంచి పేప‌ర్లు లాగేశార‌ని, మార్ష‌ల్స్‌పై తిర‌గ‌బ‌డ్డార‌ని, డెస్క్‌లు, చైర్ల‌ను ధ్వంసం చేశార‌ని, ఇది అనుచిత ప్ర‌వ‌ర్త‌న అని, వాళ్ల చ‌ర్య‌లు సిగ్గుచేటుగా ఉన్న‌ట్లు గోయ‌ల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.