Corona Effect: ఫీజలు వసూలు కాక.. అప్పులు చెల్లించలేక.. దంపతుల ఆత్మహత్య..!
కోవెలకుంట్ల: కరోనా దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ మహమ్మారి ప్రభావంతో పాఠశాళలు మూతపడటం, ఫీజులు వసూలు కాకపోవడం, అప్పులిచ్చినవారంతా ఒత్తిడి తేవడంతో యువదంపతులు విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదివారం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది.
స్థానిక వివరాల ప్రకారం… జిల్లాలలోని కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33), కోడలు రోహిణి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్రహ్మణ్యం, రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు వారిద్దరూ సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేశారు.
సెల్ఫీ వీడియోలో…
‘ఈ రోజు నేనూ.. నా భార్య చనిపోతున్నాం. అందరూ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి. మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది.’
అని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ వీడియో సంచలనాన్ని రేపింది. దంపతులిద్దరూ స్కూల్ కోసం దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులపాలయినట్లు సమాచారం. అప్పులిచ్చినవారి నుండి ఒత్తిడి ఎక్కువకావడంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుబ్రహ్మణ్యం భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు. గత ఆదివారం సాయంత్రం దంపతులిద్దరూ ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు కారులో వస్తూ మార్గమధ్యంలో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే దంపతుల వద్దకు వెళ్లి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుబ్రహ్మణ్యం మృతి చెందారు. రోహిణిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయారు. దంపతుల ఇంటి వద్దకు జనం చేరుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దంపతులు ఇద్దరి మృతితో వారి కుటుంబీకులు రోదించడం అందరినీ కలచివేసింది.